ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం. ముగ్గురు అరెస్ట్

ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం. ముగ్గురు అరెస్ట్.
నేటి చర్చ:కొత్తగూడెం: డిఎస్పి కార్యాలయం,కొత్తగూడెం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రైవేట్ చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.55.33 లక్షలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తగూడెం పట్టణంలోని న్యూ గొల్లగూడెంకు చెందిన కట్టుల సరోజ (62), కట్టుల చంద్రకళ (37), కట్టుల కుమార్ (40) కలిసి మొత్తం 11 ప్రైవేట్ చిట్టీలు నిర్వహిస్తూ ఖాతాదారుల నుంచి రూ.55,33,745 వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చిట్టీల ద్వారా వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించకుండా ఖాతాదారులను మోసం చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 188/2026 కింద కేసు నమోదు కాగా, నమ్మదగిన సమాచారం మేరకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురు నిందితులను త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద చిట్టీల లావాదేవీల వివరాలు నమోదు చేసిన ఐదు బుక్స్‌ను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసిన ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు.
ప్రజలు అధిక లాభాలు వస్తాయనే ఆశతో అనధికారిక ప్రైవేట్ చిట్టీలలో చేరి తమ కష్టార్జితాన్ని కోల్పోవద్దని డీఎస్పీ సూచించారు. చిట్టీలలో చేరే ముందు నిర్వాహకుల చట్టబద్ధత, అనుమతులను పరిశీలించాలని, సరైన రసీదులు, రికార్డులు లేకుండా నగదు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభినందించారు. ప్రజలను ఆర్థిక మోసాల నుంచి రక్షించేందుకు నిరంతరం నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
